ముదిమి కష్టాల కొలిమి కాకూడదు అంటే...
మీరు బలహీనంగా ఉన్నప్పుడు మిమ్మల్ని పుట్టించినవాడు అల్లాహ్ యే. ఆ బలహీనత తర్వాత ఆయన మీకు శక్తి కల్గించాడు. ఆ శక్తి తర్వాత తిరిగి మిమ్మల్ని బలహీనులుగా, వృద్ధులుగా చేస్తున్నాడు. ఆయన తాను తలచిన దాన్ని సృజిస్తున్నాడు. ఆయన సమస్తం ఎరిగినవాడు, సర్వ శక్తిమంతుడు. (రూమ్ / 51-54)
ముదిమి అంటే ముసలితనం. ఇది పుట్టిన ప్రతి మనిషికీ జీవిత చరమాంకంలో తప్పదు. ఎప్పుడైతే మనిషి వయసు పైబడుతుందో, ఎప్పుడైతే మనిషి ముసలి దశకు చేరువవుతాడో అప్పుడు అతని అవయవాలు డీలా పడిపోతాయి. అతనిలో పని చేసే, ఆలోచించే శక్తి క్రమేణా క్షీణించ సాగుతుంది. అతనిలోని భావాలు, ప్రేరణలు చల్లబడతాయి. ఇలాంటి దీన స్థితిలో తాను ఇతరుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడుతాడు. ఇతరుల నుండి ప్రేమ, వాత్సల్యాన్ని, మంచి మాటను ప్రవర్తనను ఆశిస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే, వయోవృద్ధులు మనం బతకబోయే బతుకు వాళ్లు. మనం నడవబోయే దారి వాళ్లు. ఇప్పటి సమాజాన్ని మనకంటే ముందు స్వప్నించినవాళ్లు. దీని నిర్మాణానికి మనకంటే ముందు రాళ్లెత్తిన వాళ్లు. చరిత్రకు ప్రత్యక్ష సాక్షులు వాళ్లు. వాళ్లు... మనవాళ్లు, మన పెద్దలు, వయోవృద్ధులు. ప్రతి అంశంలోనూ వాళ్లకు ఒక అనుభవం ఉంటుంది; ఆలోచన ఉంటుంది; తమదైన దృష్టికోణం ఉంటుంది. గతాన్ని భవిష్యత్తుతో ముడివేస్తూ వర్తమానంతో జరిపే సంభాషణ వాళ్ల జీవితసారం. అయినప్పటికీ చరిత్రలో వయోధికులకు అందాల్సినంత ఆదరణ అందిందా?వర్తమానం సంగతేమిటి?
ముదిమి కష్టాల కొలిమి
స్వీడన్‌లో అందరికందరూ విశ్వసించే నమ్మకం
ఒకటుంది. గతంలో వృద్ధులను వారి కుటుంబ సభ్యులు ఒక కొండమీదిదాకా నడిపించుకుంటూ వెళ్లేవారట.
కొండ అంచు నుంచి ఆ వృద్ధులు వారైనా దూకేసేవారట, లేదా, కుటుంబ సభ్యులైనా తోసేసేవారట. కుటుంబ సభ్యులందరూ కలిసి ఆ పని
చేసేవారు గనుక, ఏ ఒక్కరికీ వ్యక్తిగత అపరాధ భావన ఉండేది
కాదట.’ అలాగే, ఇంట్లో వృద్ధుడో, వృద్ధురాలో పనిచేయలేని వయసుకు చేరితే, కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక పొడవాటి కర్ర ఉన్న గదలాంటి దానితో
మోది తల పగలగొట్టే వాళ్లట! ఇలాంటి దురాచారమే జపాన్‌లోనూ ఉండేదట. వయసు మళ్లినవాళ్లను
సుదూర ప్రాంతంలోని ఏ కొండమీదకో తీసుకెళ్లి, వారిని అక్కడే
వదిలేసి వచ్చేవాళ్లట. ఈ అరాచకానన్నే, దిక్కుమాలిన ఈ
దురాచారాన్నే నేడు నవీకరించుకొని వృద్ధాశ్రమం
అని పిలుస్తున్నారు. ఇప్పుడంతటా
మైక్రోఫ్యామిలీసే విస్తరించిన నేపథ్యంలో వృద్ధులకు ఇవాళ ఇంట్లో చోటులేదు. వాళ్లను
పాత సామాను కింద జమచేసి వృద్ధాశ్రమాల్లోకి విసిరేస్తున్నాం. ఫలితంగా సమాజం మానవీయ
విలువలు లేకుండా, నైతిక విలువలు మర్చిపోయి మృగ ప్రాయంగా
తయారైంది. ప్రతిమనిషి వృద్ధాప్యాన్ని ఒక రోగంగా, నేరంగా భారంగా భావించి వృద్ధాప్యాన్ని
ఏవగించుకుంటున్నాడు. కాని ఏ మనిషైనా తప్పనిసరిగా చేరాల్సిన చిట్టచివరి మజిలీ
వృద్ధాప్యమే.
పొరుగు రాష్ట్రం తమిళ నాడులో ఉదయాన్నే వయసు
ఉడిగిన పెద్దవారి ఒంటికి బాగా నూనె మర్దించి స్నానం చేయిస్తారు. ఇక ఆ రోజంతా చల్లటి
కొబ్బరినీళ్లు తాగిస్తూ ఉంటారు. దీనివల్ల మూత్రపిండాలు పనిచేయవు, శరీర ఉష్ణోగ్రత పడిపోతుంది, ఫిట్స్ రావొచ్చు, ఒకట్రెండు రోజుల్లో విపరీతమైన జ్వరం
వచ్చి దుర్బల శరీరమున్న ముసలివాళ్లు కాలం చేస్తారు. ‘తలైకూతల్’ అని పిలిచే ఈ సంప్రదాయ
హత్యాకాండ దక్షిణ తమిళనాడులో కొనసాగుతోందంటూ, 2010లో ప్రసార మాధ్యమాల్లో నిరసన జ్వాలలు భగ్గుమన్నాయన్న సంగతి చాలా మందికి తెలిసే
ఉంటుంది.
వృద్ధుల విశిష్టతను తెలియజేసిన ధర్మం
ఇస్లాం
ఇస్లాం ప్రకృతి ధర్మం. అది ప్రతి వ్యక్తి
ప్రతి సమాజం యొక్క ప్రతి విధమైనటువంటి హక్కుల్ని పరిరక్షించింది. ఎవరు ఎలాంటి విలువలు
కలిగి ఉండాలో, ఎవరు ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలో హద్దులు
గీసి మరీ బోధించింది. ఇస్లాం సమాజంలోని నిరుపేదల పట్ల, నిరాధారజీవులు, అగత్య పరులు, అనాధలు, వితంతువుల పట్ల సానుభూతి, సహకారాన్ని, కరుణ, దయ, జాలిని కనబర్చాలని ప్రొత్సహిస్తుంది.
వృద్ధులు కూడా సమాజంలో ఒక భాగమే. వారిని అభిమానించటం, గౌరవించటం, వారి హక్కులను నెరవేర్చడం, వారిపట్ల ప్రేమ వాత్స ల్యాలు, మమతానురాగాలు కలిగి వుండటం అత్యంత ముఖ్యం అని వక్కాణిస్తుంది. ప్రతి మానవుడికి ఎదురయ్యే లేదా ఎదురవ్వబోయే ఈ
దయనీయ స్థితిని దృష్టిలో పెట్టుకొని ఇస్లాం వృద్ధజీవుల పట్ల మంచిగా వ్యవహరించాలని, వారిని క కస్సుబుస్సుమంటూ పలకరించ కూడదని ఆదేశించింది.
ఖుర్ఆన్లో ఇలా వుంది. "మీ ముందు వారిద్దరి
(తల్లిదండ్రులు)లో ఎవరైనా వృద్ధులై ఉంటే వారిని 'ఉఫ్ఫ్' అని కూడా విసుక్కో కండి. కసురుకుంటూ విదిలించి
మాట్లాడకండి. వారితో గౌరవంగా మాట్లాడండి. దయార్ద్ర హృదయంతో, వినయంతో వారి ముందు తలవంచి ఉండండి. (వారిపట్ల గౌరవాదరణలతో)
"ప్రభూ! వీరు నన్ను చిన్నతనంలో ఎలా కరుణతో, వాత్సల్యంతో పెంచిపోషించారో అలా నీవు వారిని కరుణించు" అని ప్రార్ధించండి.
(బనిఇస్రాయీల్: 23,24)
అల్లామా షబ్బీర్ అహ్మద్ ఉస్మాని(రహ్మ) గారు
పై వచనానికి భాష్యం చెబుతూ ఇలా 'అభిప్రాయపడ్డాడు. 'వృద్ధాప్యంలో సంతాన అవసరం వారి సేవ అవసరం అధికమై పోతుంది. కొన్ని
వేళల్లో అయినవారు కూడా విసుగు చెందుతారు. వృద్ధాప్యదశలో బుద్ధి వివేకాలు సైతం పనిచెయ్యవు.
ఇలాంటి సందర్భంలో గొప్ప సౌభాగ్యవంతులైన సంతాన కర్తవ్యం ఏమిటంటే.. వృద్ధులైన తమ తల్లిదండ్రుల
సేవ చేయడంలో ఎలాంటి అలసత్వానికి, సోమరితనానికి, ఏమరుపాటుకి చోటివ్వకూడదు. వారి సేవ చేయడం నుండి పారి పోవడానికి, సాకులు వెతకడానికి ప్రయత్నించకూడదు. సముద్ర కెరటాల్లా ఎగసిపడే
మీ ఆలోచనలతో ఎగిరెగిరి అలసిపోయి ఇక ఎగరలేక పడి వున్న వారి ఆలోచనలు అడ్జస్ట్ అవ్వకపోవచ్చు. అయినప్పటికీ మీరు వారిని ఉఫ్ అన్న
చిన్నమాట కూడా అనడానికి వీలులేదు అని హెచ్చరిస్తోంది ఖుర్ఆన్. వారితో ఎంతో మర్యాదగా, గౌరవంగా మంచిగా వ్యవహరించాలని హితవు చేస్తుంది ఇస్లాం.
పెద్దవారు పెద్ద మనసుతో అర్థం
చేసుకోవాలి
బాల్యం, కౌమారం, యవ్వనాన్నీ ఆహ్వానించినంత ఆనందంగా వృద్ధాప్యాన్ని
స్వాగతించలేడు మనిషి. నడిప్రాయం లోంచి వృద్ధాప్యంలోకి అడుగిడటానికి మనసు అంగీకరించదు.
'జనాలు నన్ను నిన్నటి వార్తను చూసినట్లు చూడకూడదు. ఇవాల్టి తాజా
వార్తలా చూడాలని కోరుకుంటాను' అంటారొక పెద్దాయన. కొందరు
వృద్ధాప్యాన్ని శాపంగా భావిస్తే...మరికొందరు ప్రశాంత జీవితం గడిపే అద్భుత వరంగా చూస్తారు.
వృద్ధాప్యాన్ని ఎవరూ తప్పించుకోలేరు. వయసు పెరిగేకొద్దీ ఆరోగ్యం క్షీణిస్తుందనుకోవటం, అనారోగ్యంతో బాధపడటం కొందరిలో జరగొచ్చు. కానీ, మన:సామర్థ్యం పదిలపరచుకునే అవకాశం ఎప్పుడూ ఉంది.
మనం మెదడును ఉపయోగించే కొద్దీ దాని సామర్థ్యం
పెరుగుతుంది. ఇది మన ఆలోచనలపైన, నేర్చుకోవడంపైన ఆధారపడి
వుంటుంది. ముఖ్యంగా 50-80 ఏళ్ల మధ్య వయస్కులు 30 ఏళ్ల పాటు మెదడు ముసలితనాన్ని దూరంగా పెట్టాలంటే...శారీరకంగా
మేథోపరంగా చురుకుగా వుండాలి. ఎంత సృజనాత్మకంగా ఆలోచించగలిగితే, మెదడు అంత ఆరోగ్యంగా, చురుకుగా వుంటుంది.
నేర్చుకోవడం పెరిగే కొద్దీ నేర్చుకునే సామర్థ్యం కూడా పెరుగుతుంది. 'ముదిమి వాలనీయకు తలపులపై',
అని చెప్పినా 'వయసు పెరిగేకొద్దీ పెద్దరికం పొందాలి కానీ, ముసలితనాన్ని కాదు' అని అన్నా పెద్దవారు
పెద్దరికంతో ఆలోచించాలనే. వయసుకనుగుణంగా అనుకూలంగా స్పందించాలనే.
బీజం అంటూ లోపల ఉండాలేగానీ, అది మొక్కవడానికి వయసు అడ్డంకి కాదు! శారీరకంగా వృద్ధాప్యంలో ప్రతికూలతలు ఉండొచ్చుగాక; నిజమైన జీవితాన్ని ఆనందించే వయసు కూడా ఇదేనేమో! బాదరబందీలు అన్నీ
తీరిపోయి,
తమ ఆలోచనల పట్ల తాము దృష్టి కేంద్రీకరించగలిగే వయసు, తీరిక ఒక వయసు దాటాకే లభిస్తుంది. అందుకే లోపలి కొత్త శక్తులను
రాబట్టుకోవడానికి మలిదశ జీవితాన్ని ఉపయోగించుకోవడం విలువైన వ్యాపకం కాగలదు. నూనూగు మీసాల ఓ నవ యువకుడు - ఓ పండు ముసలిని చైనా
భాష నేర్చుకుంటూ చూసి - ఇప్పుడు ఈ వయసులో ఇంత కఠినమైన భాష నేర్చుకోవడం అవసరమా? అని అడగగా, "బాబూ! ఏమీ నేర్చుకోకుండా
తనువు చాలించడం కన్నా ఏదోక ప్రయోజనకరమైన విషయం నేర్చుకుంటూ జీవితాన్ని చరితార్థం చేసుకోవడం
మంచిది కదా!" అని సమాధానమిచ్చాడు.
ఆ విషయానికొస్తే వృద్ధాప్యాన్ని విజయ కేతనంగా
ఎగురవేసిన వృద్ధ విజేతలు ఎందరో... సోఫోక్లిస్
తన ప్రసిద్ధ నాటకం ‘ఈడిపస్ ఎట్ కొలొనస్’ రాసినప్పుడు ఆయనకు 89 ఏళ్లు. ‘వెన్ వి డీడ్ అవేకెన్’ సృజించినప్పుడు హెన్రిక్ ఇబ్సెన్
ఏడు పదులు దాటాడు. హైడ్రోఫాయిల్ బోట్‌కు సంబంధించిన పేటెంట్ అందుకునేప్పటికి గ్రాహంబెల్
75లో పడ్డాడు. ‘వై షి వుడ్ నాట్’ నాటకాన్ని తన 94వ ఏట లిఖించాడు జార్జ్ బెర్నార్డ్ షా. ‘ఇన్ ద క్లియరింగ్’ కవితా
సంకలనం అచ్చు వేసినప్పుడు రాబర్ట్ ఫ్రాస్ట్ 88 ఏళ్ల వృద్ధుడు.
జాన్ మిల్టన్ తన 63వ ఏట ‘ప్యారడైజ్ రీగెయిన్డ్’ రాశాడు.
నో వెబ్‌స్టర్ తన సుప్రసిద్ధ డిక్షనరీని సంకలనం చేసింది ఏడు పదుల వయసులోనే. అంతెందుకు, ప్రపంచ ప్రసిద్ధ రచన ‘డాన్ కిహోటి’ రాసినప్పుడు సెర్వాంటెజ్
వయసు 70.
ప్రపంచ రాజకీయాల్ని, పరిణామాల్ని శాసించేది
కూడా వృద్ధులు కాక మరెవరు! ఉత్పత్తి అనగానే, ఏ కర్మాగారంలోనో
చెమటలు కక్కుతూ పనిచేయడం అనుకుంటాం. అది ఉత్పత్తే అయినా, అది మాత్రమే ఉత్పత్తి కాదు. ప్రపంచ ప్రసిద్ధ చాలా ‘ఉత్పత్తులు’
వయసు తెచ్చిన అనుభవసారంలోంచి పుట్టాయి.
రథసారథులను గౌరవిద్దాం
కోతికీ, ఏనుగుకూ ఒకే పరీక్ష పెట్టే సమాజంలో వృద్ధులు
చెట్లు ఎక్కకపోవచ్చు. కానీ శారీరక శక్తికి మించిన ఎన్నోరెట్ల వివేకాన్ని పంచగలరు. ఇస్లాం పెద్ద వయసుగలవారిని ఎంతగా అభిమానించి గౌరవించిందంటే.
నమాజులో నాయకత్వం వహించే విషయంలో వయసు పెద్దయి వుండటానికి ప్రాముఖ్యత ఇచ్చింది. దైవప్రవక్త(స)
ఇలా అన్నారు: జాతికి నాయకత్వం ఖుర్ఆన్ని అత్యధికంగా పఠించే వ్యక్తి వహించాలి. ఖుర్ఆన్
పఠన విషయంలో సమానులైన వారెవరైనా వుంటే... సున్నత్ (ప్రవక్త(స) గారి సంప్రదాయం) గురించి
ఎక్కువ తెలిసిన వ్యక్తి నాయకత్వానికి అర్హుడవుతాడు. ఒకవేళ సున్నత్ విషయంలో సైతం సమానులైన
వారుంటే అందరికన్నా ముందు హిజ్రత్ చేసిన వ్యక్తికి ఆ హక్కు దక్కుతుంది. హిజ్రత్ చేయడంలో
కూడా సమానులైనవారెవరైనా ఉంటే వారిందరిలోకెల్లా ఎవరి వయస్సు పెద్ద వుంటుందో అతనే ఈ పదవికి
అర్హుడైన వ్యక్తి. (ముస్లిం) ఈ హదీసు ద్వారా 'నమాజులో ఇమామత్
లాంటి ముఖ్యమైన విషయంలో పెద్ద వయస్సుగలవారికి ప్రాముఖ్యానిచ్చింది ఇస్లాం. అని తెలుస్తుంది.
హదీసు వెలుగులో వృద్ధుల విశిష్టత
హజ్రత్ అబూమూసా (రజి) గారి కథనం _ప్రకారం దైవప్రవక్త(స) ఇలా ప్రబోధించారు: అల్లాహ్ ను గౌరవించడం, అభిమానించడంలో వృద్ధ ముస్లిముల పట్ల మర్యాదగా మసలుకోవడం కూడా
ఇమిడి వుంది. (అబూ దావూద్ఇ)
మరో సందర్భంలో ఇలాఅన్నారు. మన పిన్నలపై
దయ లేని వ్యక్తి, మన పెద్దల పట్ల గౌరవ మర్యా దలు కనబర్చని వ్యక్తి నా
సముదాయంలోని వాడు కాదు. ఇంకా ఇలా అన్నారు. పిన్నలపై దయలేని వ్యక్తి పెద్దల హక్కు లను
వారి స్థానాన్ని, హోదాను గుర్తించని వ్యక్తి మనలోని
వాడు కాదు. (మిష్కాత్)
పెద్దలను గౌరవించడం, మర్యాదగా పలక రించడం స్వయంగా తననే గౌరవించినట్లు, అభిమానించినట్లు' అని పరమదాతయే చెప్పుకున్నాడు.
మరి ఎవరైతే పెద్దల హోదా అంతస్థులను, గౌరవ మర్యాదలను
గుర్తించరో వారు మనలోనివారు కాదు అవి సర్వలోక కారుణ్యమూర్తియే (స) తేటతెల్లం చేసేశారుఆ
విషయానికొస్తే, స్వయంగా ఆ పరమ ప్రభువు పెద్దలను గౌరవించమని వారికే ముందు ప్రాధాన్యత ఇవ్వమని దైవప్రవక్త
గారినే ఆదేశించాడు.
హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్(రజి) గారి కథనం
ప్రకారం: దైవప్రవక్త(స) తను కన్న కల గురించి వివరిస్తూ ఇలా అన్నారు: (అబూదావూద్) మరో
హదీసులో ప్రవక్త(స) "నేను మిస్వాక్ చేస్తూ వున్నట్లు కలగన్నాను. అంతలో ఇద్దరు
వ్యక్తులు నా దగ్గరకు వచ్చారు. వారిలో ఓ వ్యక్తి పెద్దవాడు. మరోవ్యక్తి చిన్నోడు. నేను
చిన్నోడికి మిస్వాక్ అందజేశాను. అప్పుడు పెద్దరికాన్ని దృష్టిలో పెట్టుకోండి"
అని చెప్పబడింది. అప్పుడు నేను వారిరువులోని పెద్ద వ్యక్తికి మిస్వాక్ ఇచ్చివేశాను.
స్వయంగా దైవప్రవక్త(స) ఇలా చెయ్యడమేకాక తన సహచరులకు సైతం ఇలా చెయ్యమని అన్నారు.
దైవప్రవక్త(స) భిన్న విధానాలను ఉపయో గించి
పెద్దల పట్ల సత్ప్రవర్తన, విధేయతా భావం కలిగి వుండమని యువకులకు
హితపు చేశారు. హజ్రత్ అనస్ (రజి) గారి కథనం ప్రకారం దైవప్రవక్త(స) ఇలా ప్రవ చించారు:
"ఏ యువకుడైతే ఓ వృద్ధుడ్ని అతని వృద్ధాప్యం మూలంగా గౌరవిస్తాడో. ఆ యువకుడు వృద్ధ దశకు చేరుకున్నాక అల్లాహ్ అతన్ని
గౌరవించే దాసులను నియమిస్తాడు. వారు అతని పట్ల సత్ప్రవ విధేయత కలిగి వుంటారు (తిర్మిజీ) ఈ కథనం ద్వారా మనకు అవగతమయ్యేది ఏమిటంటే, పెద్దల్ని గౌరవించడం వల్ల దేవుడు దాని ప్రతిఫలం ఇహలోకంలో కూడా
ప్రసాది.స్తాడు. నిజమైన ప్రతిఫలం పరలోకంలో ఎలాగూ వుండనే ఉంటుంది.
వృద్ధో రక్షితే రక్షితః
ఇస్లాం పిన్నలకు నేర్పిన మర్యాదల్లోని ఓ
మర్యాద పెద్దల సమక్షంలో తాము మాట్లాడకూడదనేది, పెద్దలు మాట్లాడటానికి అవకాశం కల్పించాలి.
జాతి నాయకత్వం లాంటి బాధ్యతలు సైతం ఆ జాతి పెద్దలకే పెద్ద పీట వెయ్యాలి. ఎందుకంటే.... వారు మంచి చెడు తెలిసిన
అనుభవజ్ఞులు. వారి ఆలోచన దృఢంగా వుంటుంది. ముందు చూపు, దూరదృష్టి, పటిష్టమైన భవిష్య ప్రణాళిక వారికి
తెలిసినంతగా ఉడుకు రక్తంతో దూకుడు స్వభావం గల యువకులకు తెలియదు. దైవప్రవక్త(స) గారి
సంరక్షణలో శిక్షణ పొందిన హజ్రత్ సమురా బిన్ జున్దుబ్ (ర.అ) గారు తన గురించి ఇలా తెలియ
జేశారు: నేను దైవప్రవక్త(స) గారి శాంతి యుగంలో యువకుడిని. నేను ఖుర్ఆన్ మరియు హదీసుల
కంఠస్తం చేసేవాడిని, దైవవచనాలు మరియు ప్రవక్త(స) గారి ప్రవచనాలు
నాలుకపై నానుతూ వుండేవి. అయినప్పటికిని మా మధ్య పెద్దలుండే వారు గనక ఏదైనా మాట్లాడాల్సి
వస్తే వారే మాట్లాడేవారు. (చిన్నోడినైనా) నేను మౌనంగా (వారి మాటలు వింటూ) వుండేవాడిని.
(బుఖారి- ముస్లిం) అంటే ఆయన ఖుర్ఆప్ మరియు హదీసులు పండితుడై వుండి కూడా కేవలం పిన్నవయస్సు
కారణంగా తాను మాట్లాడకుండా పెద్దలకు మాట్లాడే అవకాశమిచ్చేవారు.
వారి సారధ్యలోనే సాఫల్యం
తమ పెద్దల్ని నాయకులుగా ఎన్నుకునే జాతి
సాఫల్యం పొందుతుంది. విజయం సాధిస్తుంది. పెద్ద వ్యక్తుల్ని నాయకులుగా ఎన్నుకోవాలన్నది
వారి బుద్ధివివేశాలతో, అనుభవంతో ప్రయోజనం పొందాలన్నది ఇస్లాం
అభిమతం. ఇమాముల్ ముహద్దిసీన్ ముహమ్మద్ బిన్
ఇస్కాయీల్ బుఖారీ (రహ్మ)గారు తన పుస్తకం • 'అల్ అదబుల్ ముఫ్రిద్
'లో హకీమ్ బిన్ కైస్ బిన్ ఆసిమ్ (ర.అ) కథనాన్ని పేర్కొన్నారు. ఆయనగారి
తండ్రి హజ్రత్ కైస్ బిన్ ఆసిమ్ (ర.అ) తన చరమ ఘడియల్లో తన సంతానాన్ని పిలిచి ఇలా హితవు
చేశారు. నా కుమారుల్లారా! అల్లాహ్ యెడల తఙ్ఖవ్వా
కలిగి జీవించండి. మీ కన్నా పెద్దవారిని నాయకులుగా
ఎన్నుకోండి. ఎందుకంటే.. ఏ జాతి అయితే తమ పెద్దల్ని నాయకుల్ని చేస్తుందో ఆ జాతి తమ తండ్రికి
బదులు ప్రతినిధిగా నామకరణం చేస్తుందన్నమాట. మరి ఎప్పుడైతే పెద్దల్ని విస్మరించి పిన్నల్ని
నాయకుల్ని చేస్తుందో వారి ఈ ఎన్నిక వారి పాలిటే
శాపమువు తుంది. ధనాన్ని, ఐశ్వర్యాన్ని ప్రోగు చేయండి. ధనం గొప్ప
వ్యక్తి కీర్తిని పెంచుతుంది. ధనం మూలంగా ఆ గొప్పవ్యక్తి -చెడు శక్తుల కీడునుండి రక్షించబడతాడు.
వృద్ధోపనిషత్
ఎక్కడైతే ఇస్లాం వృద్ధులను గౌరవించమని ఆదేశించిందో
అక్కడే వృద్ధులైన పెద్దమనుషులకు సైతం కొన్ని సలహాలిచ్చింది. దైవ ప్రవక్త (స) ఇలా మందలించారు.
'అల్లాహ్ మనిషి అరవైయేండ్ల దాకా బ్రతికుండేటట్లు అతని మరణాన్ని
వాయిదా వేస్తే ఇక అతనికోసం ఎలాంటి సాకులు వదలనట్లే.' ( అంటే ఇక అతను చూపెట్టే ఏ సాకును దేవుడు
అంగీకరించడని అర్ధం)
ఒకవ్యక్తి అరవైయేండ్ల ఆయుష్షు లభించినప్పటికీ
అతను విశ్వాసస్థితిలో చేయ వలసిన పనులు చేయకుండా ఏమరుపాటులో జీవితాన్ని గడిపితే ఇక అతడు
దైవ శిక్ష నుంచి బయటపడటానికి దైవం ముందు ఎలాంటి సాకులు చూపెట్టలేడని ఈ హదీసుద్వారా
అర్థమవుతుంది. మదీనా ప్రజలు నలభై ఏళ్ళ వయస్సు రాగానే ఆరాధన నిమిత్తం తీరుబడిగా ఉండేవారని
ఇబ్న్ అబ్బాస్ ఉల్లేఖించారు.
అంటే.... మనిషి కనీసం యాభైయేండ్ల ప్రాయం లోనైనా ఏమరుపాటు
నుంచి తేరుకోవాలి. ఎందుకంటే ఆ తరువాత మరణ సమయం ఆసన్నమవుతుంది. మరణమైతే యవ్వ నంలో కూడా
వస్తుందనుకోండి. కాని యవ్వనంలో అలాంటి అవకాశాలు చాలా తక్కువ కాబట్టి జీవితంపై ఆశ ఉండవచ్చు.
అయితే యాభై సంవత్సరాల తరువాత కూడా ఇంకా మునుపటిలాగానే పాపాలు చేయటం, దైవ అవిధేయతకు ఒడిగట్టడం ఎంతో శోచనీయం. ఈ కారణంగానే దైవప్రవక్త(స)
'వెంట్రుకలు మాసి ఎముకలు" ఉడిగిన వృద్ధ వ్యభిచారి వైపు దైవం
కన్నెత్తి కూడా చూడడు" అని పేర్కొన్నారు. ప్రవక్త గారి ఈ మాటను బలపరుస్తూ ఆ పరమప్రభువు
సైతం ఇలా అంటున్నాడు.
"(ప్రళయదినాన వారితో ఇలా అనబడు తుంది) మీకు
మేము దీర్ఘాయుష్షు ఇవ్వ లేదా? అంత దీర్ఘాయుష్షులో మీరు
తలచుకుంటే గుణపాఠం నేర్చుకుని ఉండేవారు. మీ దగ్గరికి హెచ్చరించేవాడు కూడా వచ్చాడు కదా!
ఇప్పుడిక (నరక యాతనలు) చవిచూడండి. దుర్మార్గులు ఇక్కడ ఎవరూ సహాయం చేయరు, (దివ్యఖుర్ఆన్: 35-37)
మేము దీర్ఘాయుష్షు ఇచ్చినవారిని బలహీనంచేసి
వారి రూపురేఖల్ని సమూలంగా మార్చి వేస్తున్నాం. (ఈ స్థితి చూసయినా) వారికి జ్ఞానోదయం
కలగదా?
(యాసీన్ : 68)
ప్రవక్త, (స) "నెరిసిన వెంట్రుకలను తీయడాన్ని
నిషేధించారు," అంటే: తల మరియు గడ్డం నుండి తెల్ల జుట్టు.
ఆయన ఇలా అన్నారు: "ఇది ముస్లిం యొక్క
కాంతి,"
(తిర్మిజీ) అంటే: తన సమాధిలో మరియు పునరుత్థాన దినం యొక్క చీకటిలో వెలుగుగా మారుతుంది. వ్యక్తి గౌరవ మర్యాదలను పెంచే గొప్ప సాధనం. తెల్ల
వెంట్రుకలను కోరుకోవడం అంటే కాంతిని కోరుకోవడమే. అయితే గోరింటాకు (రంగు) వేస్తె అది అల్లాహ్ సృష్టిని
మార్చినట్టు కాదు.
వృద్ధ హిత సమాజం కావాలి!
'పుష్పం సంపూర్ణ వికాసం కోసం ఎన్నో దశలను
దాటి వచ్చినట్లే...మానవ జన్మ సంబుద్ధం కావడానికీ దశలు ఎన్నో ఉంటాయి. అలాగే,
మనిషి జీవనచక్రంలో వృద్ధాప్యం కూడా ఒకటి. బాదరబందీలన్నీ తీరిపోయి,
కొత్త శక్తిని, కొత్త ఆలోచనలను పునరుత్తేజింపజేసుకునే
ఒక విలువైన కాలం. వృద్ధాప్యం శాపం కాదు, వ్యాధి కాదు...అది రెండో
బాల్యం. సాధారణంగా...60 ఏళ్లు దాటగానే శారీరకంగా, మానసికంగా ముసలితనం వచ్చేసిందని భావిస్తుంటారు. కానీ ఇప్పుడు
చాలా మంది 60 ఏళ్ల తర్వాత కూడా యాక్టివ్‌గా వుంటున్నారు. సగటు జీవితకాలం బాగా పెరిగింది.
అందువల్ల డెమోగ్రఫీ (సైన్స్ ఆఫ్ పాపులేషన్) ఇప్పుడు ముసలివాళ్లను యంగ్ ఓల్డ్
(60-80),
ఓల్డ్ ఓల్డ్ (80-ఆపైన) అని రెండుగా వర్గీకరించింది. వృద్ధులైపోయామనో, బిడ్డలు పట్టించుకోడంలేదనో బాధ పడకుండా, ఒత్తిడికి లోనవకుండా తమను తాము నిరూపించుకునే దిశగా అడుగెయ్యాలి.
నలుగురితో కలిసి మెలసి వుండే వారి మెదడు చాలా చురుకుగా వుంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.
చాలామంది ఉద్యోగ విరమణ తర్వాత ఇక జీవితం అయిపోయిందనుకుంటారు. ఉద్యోగం నుంచి మాత్రమే
విరమణ తప్ప...జీవితం నుంచి కాదని గ్రహించాలి.
భారత్‌లో వృద్ధుల సంఖ్య 10 కోట్ల పైగా ఉంది. 2050 నాటికి 32 కోట్లు దాటుతుందని అంచనా. వీరి అనుభవమంతా
సమాజానికి ఉపయోగపడాలి. ప్రభుత్వాలు సైతం వృద్ధులన్న చులకన భావం వీడాలి. మనిషి మనుగడకు
రహదారి వాళ్లు. మనం నడిచే దారిలో మార్గదర్శకులు వాళ్లు. ఆ సమాజ నిర్మాణానికి రాళ్లెత్తిన
శ్రామికులు వాళ్లు. ప్రతి అంశంలోనూ వాళ్లకు అనుభవం, ఆలోచన ఉంటుంది. అలాగే, కాలగమనంలో రేపటి తరానికి మనమూ మార్గదర్శకులం
కావాలి. అప్పుడే 'జాతీయ వృద్ధుల దినోత్సవం'కు ఒక అర్థం, పరమార్థం.

Comments
Post a Comment