తల్లి ప్రేమ
- అబుల్ హాసన్
ఈ
ఉత్తరం అభాగ్యురాలైన నీ పేద తల్లి తరుపు నుండి.. ఎంతో కాలం వేచి చూసి, ఎటూ పాలుపోక, వ్రాద్దామా......
వద్దా!!.... అని తడబడుతూ ... బాధ పడుతూనే వ్రాసింది నీ తల్లి ఈ ఉత్తరాన్ని
...... చాలా . సార్లు కలాన్ని చేతపట్టాను. అయితే కన్నీటిధార దాన్ని చెరిపి
వేసింది! పలుమార్లు అశ్రుధారలను అపే విఫల
ప్రయత్నం చేశాను. గుండె బాధ ఎక్కువై మనస్సు బరువెక్కింది, హృదయం ద్రవించింది.
కుమారా! ఓ సుదీర్ఘ కాలం తరువాత నిన్ను
ఓ నిండైన మగాడిగా, కండలు తిరిగిన వీరుడిగా, వివేకం పండిన బుద్ధిమంతుడిగా చూస్తున్నాను. కన్నతల్లిగా
నాకు నీమీద గల హక్కుతో చెబుతున్నాను...
నీవు ఈ ఉత్తరాన్ని ఖచ్చితంగా చదవాలి. ఆ తరువాత నీవు తలిస్తే ఈ ఉత్తరాన్ని ముక్కలు
ముక్కలు చేసి పారవేయవచ్చు. నీ ఇష్టం.... !
కన్నా! 45 సంవత్సరాల క్రితం మాట, ఆ రోజు ఎంతో శుభప్రదమైన దినం.
డాక్టరమ్మ 'యూ
ఆర్ ప్రెగ్నెంట్ అన్నప్పుడు ఓ వైపు సిగ్గు, మరోవైపు పట్టరాని సంతోషంతో ముఖం ఎర్రబడింది. యూ ఆర్ ప్రెగ్నెంట్ అన్న చిన్న
పదానికి ప్రాధాన్యత తల్లులకే తెలుసు. ఆహ్లాదకరమైన, ఎంతటిదో ఆనంద దాయకమైన, సంతోషకరమైన శుభ ఘడియలు అవి..
మనస్చే కాదు శరీరమంతా ఓ తెలియని పులకింత... ఈ శుభవార్త అందిన తరువాత తొమ్మిది
నెలలు నిన్ను నేను నా కడుపులో పెట్టుకొని మోసాను. ఎంతో కష్టం మీద లేచేదాన్ని. ఏదైనా ఆహారం తీసుకోవాలన్నా కష్టంగా వుండేది.
శ్వాస పీల్చుకోవడం కూడా అతి కష్టం మీదే
జరిగేది. అయినప్పటికిన్నీ నీ పట్ల నా ప్రేమ రవ్వంతైనా తగ్గలేదు. నా సంతోషంలో
ఇసుమంతైనా తేడా రాలేదు..... ఇంకా చెప్పాలంటే.. నిన్ను చూడాలన్న గంపెడు ఆశతో
జీవించేదాన్ని. కలలోనైనా నిన్నూ నీ రూపాన్ని చూడాలని పరితపించిపోయేదాన్ని, నువ్వు ఇలా వుంటావు..... అలా వుంటావు అని ఊహాజగత్తులో
విహరించేదాన్ని. బరువు మీద బరువు, బాధ మీద బాధను ధరించి
నిన్ను మోశాను. ఒరేయ్ బుజ్జికొండా...! నువ్వు గర్భస్థ శిశువుగా వున్నప్పుడు నీ
చిన్నపాటి కదలికతో పొంగిపోయేదానిని రా...
పెరిగే నీ బరువు నా ఆనందాన్ని అనంత
తీరాలకు తీసుకెళ్ళేది. శిశువుని మోయడం చాలా కఠినమైన పని. గర్భం చాలా బరువైనది
బేటా.... ఈ నా పరిస్థితి ఒకటి రెండ్రోజులు కాదు, ఓ సుదీర్ఘ సమయం... ఉషాకిరణాలతో మిలమిల
మెంగిన ఆ రాత్రి... ఒక్క నిముషం కూడా
నిద్ర పట్టలేదు. కంటికి కునుకు కరువయ్యింది..... సరిగ్గా అప్పుడే ఏ కలమూ వర్ణించతరంకాని విపరీత పీడన, ఆందోళన, భయం మొదలైంది.నేను నా ఈ కళ్ళతో
మృత్యువును అనేకమార్లు అతి సమీపం నుండి చూశాను. ఎట్టకేలకు నీవు ఈ లోకంలో అడుగు
పెట్టావు గుప్పెడు ప్రాణంతో గుక్క పట్టి మరీ నీవు ఏడుస్తుంటే నీ కళ్ళ లోంచి రాలే
కన్నీటి చుక్కలు నా ఆనందభాష్పాలతో కలసి బాధలన్నిటినీ, గాయాలన్నిటిని ఒక్క సారిగా నయం చేసేశాయి.
బుజ్జీ! అనేక సంవత్సరాలు గడిచాయి ..
నేను నిన్ను నా గుండెల్లో పెట్టుకొని
చూసుకునేదాన్ని నీవు బోసినవ్వులు చిందిస్తూవుంటే, నిన్ను చూసి మురిసిపోయే దాన్ని నువ్వు ఏడుస్తుంటే జోలపాట పాడాను. లాలి పాట
పాడేను. చందమామను చూపిస్తూ గోరు ముద్దలు
తినిపించాను. బట్టలు తొడిగించాను. నా ఒడిని నీ బడిగా చేశాను. నా గుండెను
పిండిచేసి నీకు పాలు పట్టాను... రాత్రంతా జాగారం చేసి మేల్కొన్నాను. నీవు హాయిగా
పడుకోవాలని...... దినమంతా కష్టపడ్డాను. నిన్ను సంతోషంగా చూడాలని..... నీ
కోసం నీ ఆనందం కోసం నన్నూ నాకు సంబంధించిన వాటన్నిటినీ మరచిపోయాను..... నీవు .. నీ
కిష్టమైనది. ఏదైనా చేసి పెట్టమని అడుగుతావేమోనని. ఎదురు చూసేదాన్ని. నీకిష్టమైన
పిండివంటలు, జిలేబీలు చేసి పెట్టడం నా అదృష్టంగా
భావించేదాన్ని.
ఇలానే..... రాత్రి పగలంటూ కాలం ముందుకు
దూసుకుపోతూవుంది. నేను మాత్రం అలుపెరగని సేవకురాలిగా, విశ్రాంతి ఎరుగని ఆయాలా, అలసిపోని పని మనిషిలా
నా కర్తవ్యాన్ని నెరవేరుస్తూ పోయాను.
నీ అవయవాలు గట్టిపడ్డాయి. శక్తిని
యుక్తిని పుంజుకున్నాయి. నీవు యౌవన దశకు చేరుకున్నావు. నీలో పురుష లక్షణాలు
గోచరించనారంభించాయి. ఇటు నేను నీ జీవితంలో సంతోషాల పూలు పూయించే నీ జీవిత
భాగస్వామి కోసం గాలిస్తున్నాను.... చివరికి నీ పెళ్లి రోజు రానే వచ్చింది. నీకు ప్రాప్తించబోయే నూతన
జీవితాన్ని ముందుగానే ఊహించి. మురిసిపోతున్నాను. అయితే ఒకవైపు నీవు నా నుండి
దూరమైపోతున్నావన్న బాధ కూడా నన్ను వెంబడిస్తూనే ఉంది..... అలా కొంతకాలం గడిచింది.
ప్రస్తుతం నీవు నాకు తెలిసిన బాబు
కాదు.. నేనంటేనే నీకు చిరాకు. ఓ
కన్నా తల్లిగా నాకు ఇవ్వాల్సిన
హక్కుని కూడా స్వాహా చేసేశావు. రోజులు, వారాలు, నెలలు దొర్లిపోతున్నాయి.... నీ ముఖం చూడలేదు. నీ స్వరం
వినలేదు. నిన్ను పెంచి పోషించిన నీ తల్లినే మర్చిపోయావా నాయనా!
బాబు నేను నీ నుండి వజ్ర వైఢూర్యాలను గానీ, వెండి బంగారాలనుగానీ, మణి
మాణిక్యాలనుగానీ, బనారస్, కంచిపట్టు
చీరల్నిగాని కోరడం లేదురా, నీవు నీ స్నేహితులకు ఇచ్చేంత
గౌరవమైనా నాకివ్వమని అడగబోవడం లేదురా. అయితే నెలా రెండు నెలల్లో ఒక్క సారైనా వచ్చి
మంచిగా పలుకరించమని ఆశిస్తున్నాను అంతే!
కొన్ని క్షణాలైనా నేను నిన్ను చూసి తరిస్తాను.
నాయనా! నడుం పూర్తిగా ఒంగిపోయింది. జవసత్వాలు ఉడిగి, శరీరావయవాలు నాతో సహకరించడం లేదు. నా శరీరం రకరకాల రోగాలకు
పుట్టినిల్లయ్యింది. అనేక బాధలు నన్ను చుట్టుముట్టాయి. జీవితం కష్టాలకు నిలయంగా
మారిపోయింది. లేవాలన్నా కష్టం కూర్చోవాలన్నా కష్టం. అయినప్పటికిన్నీ నా నాడి నీకై
కొట్టుకుంటూనే ఉంది. బాబూ! నీతో ఎవరైనా మంచిగా ప్రవర్తిస్తే అతన్ని మెచ్చుకోవడమే
కాక అవసరం అన్పిస్తే సహాయం కూడా చేస్తావుగా. నీపై నీ తల్లి రుణాలు లెక్కకు
మించినవైనప్పటికీ అవి నీ లెక్కలోకి రావు,
"అమ్మ
రుణం తీర్చాలన్న ఇంగిత జ్ఞానం కూడా నీకు
లేకపోయింది. సంవత్సరాల తరబడి నేను నీ సేవ చేశాను. నీ తండ్రికి తెలియకుండా
ప్యాకెట్ మనీ కూడా ఇచ్చాను. నీవు చేసిన అనేక తప్పులను తల్లి మనసుతో క్షమించాను.
కాని ఎం లాభం....? నీ కరకుదనం నిన్నింత నీచ స్థాయికి దిగజార్చిందా! లేక ఈ రోజులు చూడాలని ఆ
దేవుడు ఏమైనా వ్రాసి పెట్టాడా ?
కొడకా! నీవు జీవితంలో సంతోషంగా
ఉన్నావని తెలిసినప్పుడల్లా సంబరపడేదాన్ని.. ఆనందం రెట్టింపయ్యేది. అయితే ఇప్పుడు
నన్ను చూడటం కూడా నీకు కష్టమైపోయింది? నన్ను
సందర్శించుకోవడం కూడా. భారమైపోయింది. నేను ఏం పాపం చేశానని నీకు శత్రువైపోయాను
బిడ్డా! విన్ను సాకటంలో ఏదైనా లోటు చేశానా...! నీ పోషణలో క్షణమైనా అశ్రద్ధ
వహించానా...! నీవు కోరింది ఏదైనా తక్కువ చేశానా ?? లేదు అంటే మరి ఎందుకు నీ ఈ కఠిన వైఖరి?
దొరా! నిన్ను 'దొరా!' అని ఎందుకంటున్నా
అంటే? నీ దగ్గర పని
చేసేవారికి కూలీ ఇస్తావుగా, నన్ను కూడా కూలి మనిషివనుకో... నీవనుకున్న సంబంధీకుల్లోని
నిరాధారుల్ని నిధులిచ్చి అనుకుంటావుగా, నన్ను కూడా
అభాగ్యురాలైన భిక్షగత్తెని అనుకో, నేను నీకు చేసుకున్న
సేవకి ఏ విధంగానైనా సరే కొంచెం అప్పు
అయినా ఇంత ఫరవాలేదు-ఇచ్చుకో. దొరా! ఒకరికి మేలు చెయ్యి అల్లాహ్ మేలు చేసేవారిని
ప్రేమిస్తాడు.
కన్నా! నన్ను మరింత పరీక్షించకురా..
నాలోని ఓర్పు నశించింది. నిన్ను ఒక్కసారి చూడాలని ఉందిరా.. అది తప్ప నేను కోరేది.
సైతం ఏమీ లేదు.. నా మీద కోపంతో విసుక్కునే
నిప్పులు క్రక్కే నీ ఆ ముఖాన్ని అయినాసరే ఒకే ఒక్కసారి చూపించి. వెళ్ళవా
నాన్నా! తిట్లు అయినా పరవాలేదు నాలుగు
మాటలు మాట్లాడి వెళ్ళవా నాయనా?
కొడకా! నా గుండె బద్దలౌతోంది. నా కళ్ళు
ఏడ్చీ ఏడ్చీ ఇంకిపోయాయి. నీవు మాత్రం భోగభాగ్యాలలో తేలియాడుతూ కోరికల మాజాలు జుర్రుకోవడంలో
వడి ఏమరుపాటుకి గురై జీవిస్తున్నావు. కన్నా! ఓ బలహీమరాలైన ముసలిదాని కోసమైనా నీ
మనసు కరగదా! లేక బండరాయికన్నా గట్టిదనం నీ హృదయానికి అవహించిందా? నిన్ను చూడాలన్న అశతో, కొన ఊపిరితో
ఉంది నీ తల్లి. నిన్ను చూడకుండానే ఎక్కడ దైవాన్ని చేరుకుంటుందోనన్న పుట్టెడు
దుఃఖంతో పరితపించిపోతూ ఉంది నీ అమ్మ. కన్న
వారికి దూరమై, కనికరం లేనివాడవై, కన్నీళ్ళు పెట్టించిన వాడివై, కన్న ప్రేమను కాదని కనికరం లేని గుండెవై, కళ్ళు తెరవలేని, నిజం
గ్రహించలేని, సత్యం చూడలేని దురవస్థలో పడివున్నావు.
కన్నా నీ తల్లిని కన్నీళ్ళతో కడుపు నింపుకునేలా చేసిన నీ కళ్ళు ఇప్పుడైనా
చెమ్మగిల్లవా! మమతల తల్లి మనోవేధనతో మాడి మసి అయిపోయేలా చేసిన నీ మనను ఇకనైనా
కరగదా ...! తల్లి, తండ్రి అన్న బాంధవ్యాలను మరచి
బాధలతో బ్రతికేలా చేసిన నీ అంతరాత్మ ఇకపైనైనా మేలుకోదా?
ఒరేయ్ చంటీ ! నేను షిక్వా - షికాయతు
చెయ్యను. నా బాధను ఒకరి ముందు వ్యక్తపర్చను. ఎందుకంటే, నాకు బాగా తెలుసు నా ఈ ఆర్తవాదం మేఘాల అంచులు దాటిందంటే..
ఆకాశ తలుపులు తట్టిందంటే.... నీవు చేసిన అఘాయిత్యానికి నీకు తగిన శాస్తి
జరుగుతుంది... దైవశిక్ష నీపై విరుచుకు
పడుతుంది... నీ సర్వస్వం బూడిదవుతుంది...
నీ బ్రతుకు బజారుకెక్కుతుంది... నీ పరువు వీధి పాలవుతుంది... చూసిన ప్రతి ఒక్కరూ
నిన్ను చూసి నవ్వుకుంటారు... కన్నా
ప్రేమను కాదన్నపాపానికి కన్నె ప్రేమమా
కూడా నీకు దూరమైపోతుంది. బాధను భరించలేక నీకు పిచ్చి పడుతుంది. ఇలా లేదా
దీనికన్నా భయంకరంగా ఉండవచ్చు సంభవించబోయే పరిణామం... అయితే నీవు భయపడకు, కలత చెందకు... నేను
ఎన్నటికీ అలా చేయను.. చేయ లేను... ఒరేయ్!
ఎంతైనా నేను నీ కన్న తల్లినిరా. ఇంత జరిగినా మరెంత జరిగినా నువ్వు నాలోని
సగానివిరా! నా జీవితపు పరిమళానివిరా
నువ్వు. కాటి మట్టిలో కలిసిపోనైనా
పోతానుగానీ నీపై మాత్రం దుమ్మెత్తి
పోయనురా! మట్టి కొట్టుకు పోతావు పో, అని శాపనార్థాలు పెట్టనురా!
ఒరేయ్ చిట్టీ! కాస్త ఆగు... చూడు నీ
వెంట్రుకులు సైతం తెల్లబడుతున్నాయి. వృద్ధాప్య ఛాయలు నీలో తొంగి చూడటానికి ఉరకలేస్తున్నాయి..
ఇంకెన్ని రోజులు నీవూ పండు ముసలివైపోతావు
"కమా తుదీసు తుడాను' అని దైవ ప్రవక్త చెప్పి
ఉన్నారు." జైసీ కర్నీ వైసీ భర్నీ"
నీతో కూడా ఇలానే ప్రవర్తించడం
జరుగుతుంది. నిన్ను కూడా ఓ చిరిగిన కంబలి ఇచ్చి పాత సామానుల స్టోరు రూములో ఓ మూలన పడేయడం జరుగుతుంది. నీవు
సైతం నీ సంతానాన్ని అశ్రుపూరితమైన నయనాలతో, వణికే చేతులతో, సిగ్గుతో నీరైపోతూ నేను నీకు వ్రాసినట్లే... ఉత్తరాల మీద
ఉత్తరాలు రాస్తావు..! చెడు అన్నది ఏ కోవకు చెందినదైనా అది దైవం దగ్గర
లెక్కించబడుతూనే ఉంటుంది. లెక్క తేల్చకుండా ఆ దైవ వదలడు.
ఒరేయ్.. నీ తల్లి విషయంలో అల్లాహ్
కు భయపడు.. నీ అమ్మ కన్నీళ్ళు తుడువు...
ఆమె బాధను పంచుకో ఆ తరువాత నీవు తలిస్తే ఆమె రాసిన ఈ ఉత్తరాన్ని చింపెయ్యవచ్చు.
గుర్తుంచుకో.....! మేలు చేసేవారు తమ కోసమే మేలు
చేసుకుంటున్నారు. కీడు చేసేవారు తమ ఆత్మలకే నష్టం చేకూర్చుకుంటున్నారు. ఇక
సెలవు... ఇట్లు ... నీ తల్లీ

Comments
Post a Comment